E-Book

Hasyanandam February 2021 E-Book

Pl, Share This >>

హాస్యానందం ఆప్తులకు, సన్నిహితులకు,
అభిమానులకు హాస్యాభివందనాలు.

హాస్యానందం 200వ సంచికకు చేరుకున్న ఈ శుభతరుణం నిజంగా ఆనందదాయకం! అయితే ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదొడుకులో అననుగానీ.. ఎంతోమంది మహానుభావులు అండదండలు, సహాయ సహకారాలు, ఆశీస్సులు, మార్గదర్శకాలు అందించారని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇది మన పత్రిక అంటూ భావించిన నా ఆత్మీయులందరినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన బాధ్యతగా భావిస్తున్నాను.
డా॥కె.వి రమణాచారి గారు, శ్రీతనికెళ్ళ భరణి గారు, డా॥సుదర్శన్ గారు, శ్రీ బ్నిం గారు,
డా॥ గురవారెడ్డి గారు, శ్రీ ఎల్బీ శ్రీరాం గారు, డా॥యండమూరి వీరేంద్రనాథ్ గారు, శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, శ్రీ కె.వి.వి.సత్యనారాయణ గారు… ఇంకా మన రచయితలు, రచయిత్రులు, చిత్రకారులు, కార్టూనిస్టులు, పత్రికా చందాదారులు, జీవిత చందాదారులు, ఏజెంట్లు… వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
సకాలంలో పత్రిక రావడానికి ముఖ్య కారకులైన మా ‘రెయిన్బో’ ప్రెస్ అధినేత శ్రీనరేంద్ర గారికీ, అక్షరదోషాలు లేకుండా టైప్ చేసి, నాపనిని తగ్గిస్తున్న శ్రీమతి లక్ష్మీగారికీ ప్రత్యేకమయిన కృతజ్ఞతలు. ఈ 200 సంచిక తెలుగు హాస్య పత్రిక చరిత్ర లో ఒక గొప్ప ‘స్మైలురాయి’!
2013 లో నేనూ, నా మిత్రుడు దయాకర్ కలిసి ప్రారంభించిన ‘హాస్యానందం’ ఈ రోజు హాస్య ప్రియుల, హాస్యాభిమానుల అభిమానాన్ని సంపాందించుకుని ఈ ‘స్థాయి’కి చేరుకుంది.
ఈ సందర్భంగా మన తెలుగు హాస్య నటీనటుల గురించి ‘క్లుప్తంగా’ విషయసేకరణ చేసి ఒక ప్రత్యేక సంచిక రూపొందిద్దాం… అని మా చిరకాల మిత్రులు సినీ కాలమిస్ట్ శ్రీ సరయూ శేఖర్ తో నా ఆలోచన చెప్పాను. ఆయన అంగీకారంతో ఈ కార్యాచరణ మొదలెట్టాము.
మా ఈ ప్రయత్నం చెప్పగానే ‘సన్ షైన్’ డాక్టర్ గురవారెడ్డి గారి ప్రోత్సాహంతో, చేయూతతో ‘గొప్ప’ సంచికగా రూపొందించాలనే ఆలోచనగా మారింది. ఈ క్రమంలో డాక్టర్ రామకుమార్, గుంటూరు, డా॥చంద్రశేఖర్, ఆస్ట్రేలియా, డాక్టర్ టి. చంద్రశేఖర రెడ్డి, బాపూరమణ అకాడమీ శ్రీసుబ్బరాజు, సాంబమూర్తి ఎంటర్ప్రైజేస్ అధినేత శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, సాహితీ ప్రచురణలు శ్రీమతి లక్ష్మీ, గో.తెలుగు.కామ్ బన్నుగార్లు… ఇంకా ‘అభినందన’ ప్రకటనలిచ్చిన మిత్రులు ఈ ప్రత్యేక సంచిక రూపకల్పనకు మూల స్థంభాలయ్యారు.
వీరందరి అండదండలతో ఎక్కువ పేజీలతో, మంచి పేపరుతో రూపొందించిన ఈ ప్రత్యేక సంచిక వ్యయం ఎక్కువయినా, పాఠకులకు ఆర్థిక భారం పడకుండా 20 రూపాయలకే అందిస్తూన్నాం! ఈ సందర్భంగా హాస్యానందానికి తమ ఆశీస్సులు అందించిన ఆత్మీయులందరికీ నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సాహించే ముఖ్యవ్యక్తి నా సహధర్మచారిణి ‘భవాని’ కి నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు. అందరి అభిమానాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవడానికి మరింత శ్రద్ధతో పత్రికని రూపొందిస్తానని మనవి చేసుకుంటూ… ఈ సంచిక రూపొందించటంలో ఏమైనా పొరపాట్లు జరిగుంటే పెద్ద మనసుతో మన్నించండి!

అందరూ ఆనందంగా… ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ…

Ramu-Sign
February-Hasyanandam


Pl, Share This >>

2 thoughts on “Hasyanandam February 2021 E-Book

Leave a Reply