Hasyanandam July 2024 E Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు.. సన్నిహితులకు హాస్యాభివందనాలు!
మనమందరం కోరుకునేది ఆనందంతో కూడుకున్న జీవితం!.. ఆ ఆనందం ఎవరి స్థాయిలో వారు పొందుతాం! అయితే మన ఆనందం కోసమే కళలు సృష్టించ బడ్డాయి. కళాకారులలైన నటీనటులు, రచయిత, రచయిత్రులు, కార్టూనిస్టులు తమ ప్రతిభతో మనల్ని ఆనందింపజేస్తుంటారు.
‘ఆనందం’ కోసం ఉపయోగపడే గొప్ప ప్రక్రియ ‘హాస్యం”!.. అదే హాస్యానందం!
పాఠకులను అక్షరాలతో నవ్వించే ఈ ‘హాస్యబ్రహ్మ’లను ‘సత్కరించాలనే’ ఉద్దేశంతో హాస్యానందం ప్రత్యేక సంచికలు రూపొందిస్తోంది. తెలుగు పత్రిక చరిత్రలో ఇలా ప్రత్యేక సంచికలను వెలువరిస్తున్నది ఒక్క హాస్యానందమే!
హాస్యాన్ని అందలం ఎక్కిస్తున్న వారికి పట్టాభిషేకం చేయడమే మా ఉద్దేశం.
ఈ పరంపరలో ఈ సంచిక ‘హాస్య సాహితీ సామ్రాజ్యలక్ష్మి’ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి ప్రత్యేక సంచికగా రూపొందించటం జరిగింది. సున్నితమైన హాస్యం, మన మధ్యే జరిగే సంఘటనలు, మనసుకు హత్తుకునే శైలీ.. ఇవన్నీ విజయలక్ష్మిగారి ప్రత్యేకతలు. మనకు మహిళా రచయిత్రులు ఎంతోమంది ఉన్నా.. విజయలక్ష్మిగారు మాత్రమే హాస్య రచయిత్రిగా గుర్తింపు పొందారంటే వారు నిబద్ధతతో రాసిన హాస్య కథలే నిదర్శనాలు.
‘శ్రీవారికి ప్రేమలేఖ’ హాస్యప్రియులకు విందుభోజనం.. వడ్డించింది జంధ్యాలగారైతే.. వండింది మాత్రం విజయలక్ష్మిగారే.
వీరి హాస్య రచనా సేద్యంలో ఎన్నో సంఘటనలు. వాటిలో కొన్నింటిని ఈ సంచికలో ఆవిష్కరించామనే భావిస్తున్నాం!
ఆవిడకు ఆప్తులైన చాలామంది విజయలక్ష్మిగారి గురించి తమ అభిప్రాయాలు రాసి ఈ ప్రత్యేక సంచికకు, మరింత ప్రత్యేకతను సంతరింపజేసారు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
ఎప్పట్లానే ఈ ప్రత్యేక సంచిక మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తూ.. అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..
ఎడిటర్, రాము. పి
Hasyanandam-July-2024-suryatoons
Good Magazine