Cartoonist Galisetty Cartoons Book
గాలిశెట్టి కార్టూన్ల సందడి
నా మాట..
మనిషికి మానసిక ఉల్లాసాన్ని, వినోదాన్ని కల్గించే ప్రక్రియ లెన్ని ఉన్నా కార్టూన్ ప్రక్రియదే పై చేయిగా ఉంటుంది. మనిషి ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా మనసుకు ఇన్స్టాంట్ బూస్టింగ్ని ఇచ్చేవి కార్టూన్లు. చిన్న పిల్లాడి నుండి ముదుసలి వరకు తక్షణమే ఆకర్షించేవి కార్టూన్లు.
కార్టూన్లు అంటే ఇష్టంలేని వ్యక్తి అంటూ ఉండడు. ఎంతటి జడపదార్థంలా ఉండే మనిషినైనా చక్కిలిగిలి పెట్టి నవ్విస్తాయి. వేయి మాటల్లో చెప్పలేని సందేశం ఒక కార్టూన్ చెబుతుంది అనేది అక్షర సత్యం. అగ్గిపుల్ల సబ్బుబిల్లా, కుక్కపిల్ల కాదేది కవితకనర్హం అనే శ్రీశ్రీ నానుడి కవితలకే కాదు కార్టూన్లకూ వర్తిస్తుందని చెప్పవచ్చు. సృష్టిలోని ప్రతీది కార్టూనుకు వస్తువే. అది ఉపయోగించుకునే కార్టూనిస్టు తీరును బట్టి ఉంటుంది. కొన్ని కార్టూన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. కొన్ని కార్టూన్లు సమాజంలోని ప్రతి మనిషిలోని మంచి చెడులను బెరీజు వేసి లెక్కలు అప్పచెప్పేలా ఉంటాయి. తప్పు చేసే ప్రతి మనిషికి సున్నితమైన చురకలు అంటిస్తాయి. హోల్ మొత్తంగా ప్రపంచములోని సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులను నిత్యం తూకం వేస్తుంటాయి…తద్వారా మనిషిని క్రమబద్ధమైన జీవనానికి తోడ్పాటునిస్తాయి.
ఇంతటి మహత్యం గల కార్టూనులంటే నాకు చిన్నప్పటి నుండి వల్లమాలిన ఇష్టం. నేను 8వ తరగతి చదువుతున్న రోజులలో మా ఖమ్మంలో నిర్వహించబడిన తెలుగు కార్టూనిస్టుల మహాసభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్టూన్ల ఎగ్జిబిషన్లో ఆయా కార్టూన్లు చూసిన మీదట కార్టూన్ల పట్ల అభిష్టం ఏర్పడింది. రానురాను కార్టూన్లు నా గీయాలనే తపన మొదలైంది. ఆ తపనే నన్నూ ఓ కార్టూనిస్టుగా మలచింది. ప్రముఖ చిత్రకారుడు మరియు కార్టూనిస్టు చంద్రగారు, జయదేవ్ బాబు గారి సలహలు సూచనలు నన్ను కార్టూనిస్టుగా నిలబెట్టాయి. వారికెప్పుడు నేను కృతజ్ఞడను.
1982లో వెంకట్ అవార్డు కార్టూన్ల పోటీలో పాల్గోనడంతో మొదలైన నా కార్టూన్ల ప్రస్తానం 1994 వరకు కొనసాగింది. అప్పటి వరకు దాదాపుగా అన్ని పత్రికల్లో నా కార్టూన్లు అడపాదడపా ప్రచురించబడటమే కాక కొద్దిపాటి బహుమతులు కూడా అందుకున్నాయి. ఆపై 1995 నుండి 2017 వరకూ విరామం.
కార్టూన్లు గీయడంలో రాశికన్నా వాసి మిన్న అనే జయదేవ్ గారి సూత్రాన్ని నేను తూచతప్పకుండా పాటిస్తున్నాను. వేల సంఖ్యలో కార్టూన్లు గీయకపోయినా అందరికీ గుర్తుండి పొయేలా వందల సంఖ్యలో మాత్రమే నేను కార్టూన్లు గీశాను. 2018లో తహాశీల్దార్ పదవీ విరమణ అనంతరం కార్టూనిస్టుగా నా రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను. అప్పటి నుండి రాష్ట్ర స్థాయిలో పలు బహుమతులు అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతి, బెస్ట్ కార్టూన్ అవార్డు, థీమ్ అవార్డు, స్పెషల్ ప్రైజ్ అవార్డుతో పాటు పలు పోటీలలో మెరిట్ సర్టిఫికేట్లు అందుకున్నాను.
మలేషియా, వియత్నాం, కొరియా, చైనా, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటినా, ఇటలీ, ఈజిప్టు, టర్కీ, పోర్చుగల్, రొమెనియా, ఫలిప్పైన్స్ వంటి పలు అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో నా కార్టూన్లు ప్రదర్శించబడ్డాయి. పలు అంతర్జాతీయ పోటీలకు చెందిన క్యాటలాగ్స్ ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకు నేను గీసిన కార్టున్లలో సైలెంట్ కార్టూన్లే అధికం. అంతర్జాతీయ స్థాయిలో వాటికే ప్రాముఖ్యతనిస్తారు.
నా ఈ కార్టూన్ల సంకలనానికి సంకల్ప బలాన్ని చేకూర్చి అందుకు అన్ని విధాలుగా సహకరించిన సీనియర్ కార్టూనిస్టు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేటు అయిన మిత్రులు బాచి గారికి సదా కృతజ్ఞడను. ఆయన గారు నన్నే కాదు తెలుగు కార్టునిస్టులందరినీ, ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఒక్క కార్డును గీయండి అని తరచూ వెంటబడేవారు. అలా వెంబడించి చివరకు తెలుగు కార్టునిస్టులలో చాలామంది చేత వారి వారి కార్టున్ల సంకలనాలు వెలువరిం చెందుకు కంకణం కట్టుకొని ఆ పని పూర్తి చేయిస్తున్నందుకు ఆయా తెలుగు కార్టూనిస్టులందరి తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా ఈ కార్టూన్ల సంకలనానికి అడిగినదే తడవుగా ముందు మాటను వ్రాసి అందజేసిన ప్రముఖ కార్టునిస్టు జయదేవ్ బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. అదే విధంగా ఈ పుస్తకం అందంగా ముస్తాబు చేసిన రూపశిల్ప హాస్యానందం రాము గారికి నా కృతజ్ఞతాభివందనాలు.
-గాలిశెట్టి
పుస్తకం పేజీలు 128 | వెల రూ.200/- QR పై చెల్లించి ఆర్డర్ చేయండి.

