Hasyanandam October 2024 E Book
హాయ్.. సానందంగా…
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు.. సన్నిహితులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు!
పండుగలు మన సంస్కృతికి పట్టుకొమ్మలు! ప్రతి పండుగకి ఒక కథ ఉంటుంది. ఒక ప్రయోజనముంటుంది.. మనమేంటో ఈ పండుగలు చెబుతాయి.
ఈ నెలలో రెండు పండుగలు మనకొస్తున్నాయి.
మన పండుగల పరమార్థం చెడుపై మంచి గెలవడం!
ఎంతటి బలవంతులైన అధర్మం చేస్తే మట్టిలో కలిసిపోతారు అనే సాక్ష్యాలు కోకొల్లలు! నీతిమాలిన పనులు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని చాటి చెప్పడమే కాకుండా.. నీతిగా బ్రతకమని హెచ్చరిస్తాయి మన పండుగలు.
మహిషాసురుని వధ ‘దసరా’గా మనం జరుపుకుంటుంటే.. నరకాసురుణ్ణి నరకానికి పంపినందుకు ‘దీపావళి’ మన పండుగయింది. ఇలాంటి కథలు విని, వాటి మూలంగా ఏర్పడిన ఈ సంబరాలు.. చేస్తున్న మనం ఎంత ‘నీతి’గా ఉంటున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం! రోజూ వార్తల్లో సిగ్గులేకుండా నీతిమాలిన పనులను చేస్తున్న వారిని చూసి మనం ఏం చేయకూడదో నేర్చుకుందాం! అలాంటి జీవన విధానం ప్రశాంతంగా ఉండదనేది సత్యం! అందరి కళ్ళు కప్పి చేసే ‘అకృత్యాలు’ మనకి తెలియక పోవచ్చు కానీ.. సర్వవ్యాపితమైన జగన్మాత నుండి తప్పించుకోగలరా?!
ఈ విజయదశమి సందర్భంగా అమ్మని ఇలా ప్రార్ధిద్దాం..
‘అమ్మా!… నిజాయితిగా బ్రతికే ఏ ఒక్కడ్ని చిరునవ్వు నుంచి దూరం చేయకు!’ అని.
కుటుంబ సభ్యులందరు కలిసి ‘పండుగ’ చేసుకుంటే ఆ ‘ఆనందమే’ వేరు.
నేటి గజిబిజి జీవనవిధానంలో అప్పుడప్పుడు వచ్చే పండుగలకి అందరు కలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీని వలన బంధాలు, బంధుత్వాలు బలపడడమే కాకుండా, ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థలో భాగస్వాములవుతాము.
ఆనందానికి ప్రతీకలైన మన పండుగలని వీలు ‘చూసుకుని’ కాకుండా వీలు ‘చేసుకుని’ జరుపుకుందాం! ఆనందాన్ని మన స్వంతం చేసుకుందాం! అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..
ఎడిటర్, రాము. పి
Hasyanandam-October-2024