Hasyanandam December 2023 E-Book
హాయ్…సానందంగా..
హాస్యానందం అభిమానులకు… ఆప్తులకు… హాస్యప్రియులకు సన్నిహితులకు హాస్యాభివందనాలు!
ఆనందానికి అర్ధం మారిపోతున్నదా?.. మార్చేస్తున్నామా?
ఇప్పటికే చాలా విషయాల్లో ‘అప్పట్లో’ ఇలా ఉండేది.. అలా చేసేవాళ్ళం అనే మాటలు వింటున్నాం! చాలా విషయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.. అలానే ఆనందంగా గడిపే క్షణాలు కూడా! ఒకప్పుడు అంటే కొన్నాళ్ళక్రితం వరకు ‘పెళ్ళి’ కార్యక్రమంలో అందరూ కలిసి ఆనందంగా కబుర్లు, ముచ్చట్లతో కాలక్షేపం చేసేవారు. మరి ఇప్పుడు.. వెళ్ళామా.. గిఫ్ట్ ఇచ్చామా (కిలోమీటర్ క్యూలో నిలబడి).. తిన్నామా.. వచ్చామా.. అనే తీరుగా మారిపోయింది. ‘మేము రాలేము గానీ లైవ్ లింక్ పెట్టండి’ అనే టెక్నాలజీశూరులు కోకొల్లలు తయారయ్యారు. పోనీ ఆ ‘లింనైనా సాంతం చూస్తారా అంటే అదీ లేదు! బాధాకరమైన విషయం ఏమిటంటే ‘ఈ తరం వారికి చెప్పవలసిన ‘పెద్ద’లే ఇలా ప్రవర్తించడం! గత తరానికి రాబోయే తరానికి వారధిలా ఉండాల్సిన పెద్దలే అంటీముట్టనట్లు ఉంటే, ముందు తరానికి ‘ఇవి’ ఎవరు చెప్తారు?
పోనీ ఆ ‘పెళ్ళి’ తంతు ఆనందంగా జరుపుతున్నారా అంటే అదీ లేదు! ‘ఆల్బమ్’ కోసం జరుపుతున్న తంతైపోయింది ఈ రోజుల్లో ‘పెళ్ళి’. పురోహితుల కంటే ఫొటోగ్రాఫర్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది వేదికల మీద.
ఇక అందరి చేతులలో ‘సెహెల్ ఫోన్లు వచ్చిందెందుకు? చేస్తుందేమిటి? అంత మంది జనంలో కూడా మనం ‘కుచించుకుపోయి ఫోన్తోనే కాలక్షేపం చేయడం ఎంత వరకు సమంజసం?.. మీరే ఆలోచించండి?! అందరితో పాటు మేమూ అనే పలాయనవాద సిద్ధాంతం రాజ్యమేలుతున్నప్పుడు ఇక ‘ఆనందం’ ఎలా ఉంటుంది? హడావిడి…కంగారు.. పరుగులు తప్ప! ఏదేమైనా ఒక ‘సంప్రదాయం’లో ఆనందం అనే ‘సూత్రం’ దూరమైతుందనేది మాత్రం నిజం!
ఇక ‘పండుగ’ల్లో కూడా ఎవరి ఫోన్లలో వారు బిజీగా ఉంటూ అదే ‘ఆనందం’ అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. నలుగురు కలిసే సమయంలో కూడా చేతిలో ‘ఫోన్’తో లీనమైపోతున్న ఈతరం నిజమైన ఆనందంలో ఆనందాన్ని మళ్ళీ అనుభవిస్తారా అనేది పెద్ద ప్రశ్న
ప్రపంచాన్ని మనం మార్చలేమేమో గానీ కనీసం మనం, మన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే క్షణాలని వెనకేసుకుందాం! నలుగురు కలిసి నప్పుడైనా ‘సెల్ ఫోన్ని కాస్త పక్కన పెడదాం.. మనుషుల మాటల్ని ప్రత్యక్షంగా విందాం!
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. (ఇవి ఎవరినో కించ పరచడానికి చెప్పటం లేదు. ఈ మధ్య నేను వీక్షించిన కొన్ని బాధాకరమైన ఆనందలేమి సంఘటనలకు ప్రతిస్పందన)
Hasyanandam-December_2023