Cartoons

కార్టూనిస్టులు మారినా కార్టూన్ స్టైల్ మారదు ! ఈనాడులో అంతే..!!

Pl, Share This >>

కొంతమంది వ్యాపారవేత్తల క్రియేటివ్ అభిరుచి, దాన్ని అమలుపరిచే విధానాలు చూస్తుంటే.. విడ్డూరంగా అనిపిస్తుంటుంది. పెద్ద సంస్థ అనో, స్థిరమైన ఉద్యోగం కోసమో.. కొంతమంది కళాకారులూ, క్రియేటర్స్ కూడా.. వారిలోని సొంత స్టైల్, టాలెంట్ ని అణిచేసుకొని, సదరు కంపెనీ ఓనరు అభిరుచికి అనుగుణంగా.. తమది కాని స్టైల్ లో, ‘కౌలు’ పంట పండిస్తూ..క్రియేటివ్ కూలీలుగా బతికేస్తుంటారు.

పూర్వం, నాటకాల్లో పెద్ద పెద్ద ఘట్టాలు ప్రదర్శించేటప్పుడు, ఒకటో కృష్ణుడు..రెండో కృషుడు.. అని, ఒకే పాత్రని ఇద్దరు ముగ్గురి చేత వేయించేవారు. అదే తీరుగా 50 ఏళ్లపాటు..RK లక్ష్మణ్, డేవిడ్ లో, బాల్ థాకరేల.. నకలు కార్టూన్ల కింద సంతకాలు మారుతున్నా, బొమ్మల బోల్డ్ స్ట్రోక్, స్టైల్ మాత్రం అదే ‘ప్రియా’ పాత చింతకాయ పచ్చడిలా నిల్వ కంపు కొడుతూనే వున్నాయి.

సాధారణంగా పత్రికలు, ప్రచురణలు, చదివేందుకు అనుకూలంగా, తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫాంట్ (లిపి) ని వాడుతుంటాయి, కానీ ఇక్కడ విడ్డూరం చూడండి, ఎంతో క్రేయేటివ్, యునీక్ స్కిల్ ఐన కార్టూన్ని కూడా ఒక ఫాంట్ లాగా మార్చేసిన ఘనత ఈనాడుది.

ఇదంతా, సగటు పాఠకులు పట్టించుకోకున్నా, కొంచెం కార్టూన్ల మీద అవగాహన వున్నవారికి, అప్పట్లో టైమ్స్ అఫ్ ఇండియా, ఇల్లస్ట్రేటెడ్ వీక్లి చూసేవారికీ ఒకింత విస్మయాన్ని కలిగించే ఉంటుంది.

ఇలాంటి ఈనాడు ఒంటెద్దు పోకడలకు ధీటుగా పోటీ ఇచ్చిన ఆనాటి మేటి పత్రిక “ఉదయం” సినిమా పత్రిక “శివరంజని”. అన్ని అంశాలతో పాటూ.. కార్టూన్లు, ఇల్లస్ట్రేషన్స్, పేజ్ డిజైనింగ్ లలో కూడా “ఉదయం” ఒక వెలుగు, వెలిగింది.

అందులో “ఈనాడు” కాపీ స్టైల్ మూస ధోరణి కార్టూన్లకి చెక్ పెట్టి, కత్తి లాంటి, సొంత స్టైల్ తో.. విజృంభించిన మన ” ఏలూరు” జూట్ మిల్లు బుల్లోడు, విజయవాడ “విశాలాంధ్ర” ఎర్ర సూరీడు, మోహన్ ది గ్రేట్.

అప్పటివరకూ ఉసూరుమంటూ, నత్తనడకలా సాగుతున్న దినపత్రికల కార్టూన్ల ప్రక్రియలో, ‘మోహన్’ మెరుపు వేగం గీతలూ, మొనాటనీ ‘మతి పోగోట్టే’ ఎనాటమీ భంగిమలు, కళ్లు చెళ్లు మనిపించే చేతిరాత స్టైలూ, ఒక విప్లవాన్నే సృష్టించాయి.

దానికి తోడూ, చిన్నా పెద్దా..అనే తేడా, డాబూ, దర్పం, గర్వం లేకుండా, అందరితో కలసిపోయే “కామ్రేడ్” మోహన్ సాహచర్యం.. అప్పటి అనేక మంది యువ కార్టూనిస్టులకి ఉత్సాహాన్ని, స్ఫూర్తినీ కలిగించాయి. వారిలో ఎంతోమంది, మోహన్ ఏకలవ్య శిష్యరికంలో రాణించి, వారి సొంత స్టైల్ తో పలు పత్రికల్లో, యానిమేషన్ రంగంలో రాణించారు.

తెలుగు పత్రికా ప్రపంచంలో, అలాంటి ‘మోహన్’ కార్టూన్ విప్లవాన్ని చూసికూడా, ఇంతకుడా ఉత్తేజం పొందకుండా, ఈనాడు..ఈనాటికీ, అదే మూస ధోరణి కార్టూన్లనే కొత్త కార్టూనిస్టులతో రుద్దింఛీ..రుద్దింఛీ..వడ్డించడం..కార్టూనిస్టులకీ, కార్టూన్ ‘ఇస్టు’లకీ.. యాక్ మనిపిస్తుంది.

ఒకప్పటి స్టేజీ, సురభి నాటకం, డ్రామా లాంటి కళా రూపాల్లాగా – ఆదరణ తగ్గి, కొన ఉపిరితో కొట్టుకుంటున్నపత్రికలు, రాబడి లేక క్రమంగా తెరమరుగైపోతున్న కార్టూనింగ్ వల్ల, కొత్తగా ఎవరూ ఈ కళ నేర్చుకోవడానికి ఆసక్తి కనపరచడం లేదు. అలాంటిది, వున్న రెండు మూడు పత్రికలు కూడా.. యాడ్స్ ఆదాయం కోసం మొదటి పేజీ.. పాకెట్ కార్టూన్ని లోపల పేజీల్లోకి నెట్టేయడం, పెద్ద (ఎడిట్) కార్టూన్ల ని పూర్తిగా ఎత్తేయడం, కాపీ కార్టూన్లని బలవంతంగా రుద్దడం దురదృష్టకరం. ఇప్పటి కార్టూనిస్టులు కూడా గతి-మతి లేక యాజమాన్యం పొలిటికల్ పాలసీలకు అనుకూలంగా, వారి సూచనలకు అనుగుణంగా ‘గుమస్తా గిరీ’ గీతలు గీస్తూ, చివరితరం చీప్ కార్టూనిస్టులుగా మిగిలిపోతున్నారు.

ఇది తెలుగు కార్టూనిజానికి విషాదకరమైన ముగింపు కాకూడదని ఆసిస్తూ.._ సూర్య SURYATOONS.COM


Pl, Share This >>

Leave a Reply