కోటి దీపోత్సవంలో ఈ సూచనలు పాటించండి
గత పుష్కర కాలంపైగా, హైదరాబాద్ NTR స్టేడియం లో Ntv, భక్తి టీవీ, ఘనంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం, ఈ నెల 9 నుండి 25 దాక, 17 రోజులపాటు, దేదీప్యమానంగా, కన్నుల పండుగగా జరగనుంది.
ఈ కార్తీక దీపోత్సవంలో రోజుకో పుణ్యక్షేత్రం నుంచి తరలివచ్చిన దేవతా ఉత్సవ మూర్తులతో, ప్రత్యేక పూజలు, యాగాలు, పల్లకీ సేవలూ, నిర్వహించ బడతాయి.
హైదరాబాద్ తో పాటూ సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో, ఆ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతుంది.
ఐతే ప్రతి ఏటా వచ్చే వారితో పాటూ కొత్తగా వచ్చే భక్తుల సౌకర్యం కోసం, ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.

1- సమయ పాలన: సాయంత్రం ఐదున్నర కల్లా, ప్రాంగణానికి చేరుకొని, ఆలస్యమయ్యేకొద్దీ పెరిగే రద్దీని తగ్గించండి.
జనరల్ ఎంట్రన్స్ వైపు కొంచెం లేట్ ఐనా ఎంట్రీ దొరుకుతుంది కానీ వేదికకు దూరంగా కూర్చోవాల్సి వస్తుంది. గ్రౌండ్ లో నలుమూలలా, LED Display Screens ఉంటాయి కాబట్టి, కార్యక్రమాలు వీక్షించడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.
కానీ VIP ఎంట్రీ వైపు పాసులతో వచ్చేవారు, పాస్ వుంది కదా అని ధీమాగా, లేట్ గా వెళితే మాత్రం, ఎంట్రీ దగ్గర విపరీతమైన రద్దీని తట్టుకోవడమే కాకుండా, లోన కూర్చునే చోటకూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
2-స్వీయ పర్యవేక్షణ: నిర్విరామంగా 3 – 4 గంటలు జరిగే కార్యక్రమం కాబట్టి, పిల్లలు, వృద్ధులు, ఉపవాసాలు చేసేవారు, నీరసించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
3- అప్రమత్తత: మీ పిల్లలు తప్పిపోకుండా, విలువైన వస్తువులు, నగలు, ఫోన్లు, పోగొట్టుకోకుండా జాగ్రత్తపడండి,
4- జాగరూకత: ఎటువంటి అసౌకర్యం, అవాంఛనీయమైన ఘటన జరిగినా, అక్కడ సెక్యూరిటీ, నిర్వాహణా సిబ్బందితో పాటూ, సిద్ధంగా వున్న పోలీస్, ఫయిర్, అంబులెన్స్ సేవలను, వినియోగించుకోండి.
5- ట్రాఫిక్ / ట్రాన్స్ పోర్ట్: అక్కడికి దగ్గరలో మెట్రో ట్రైన్ అందుబాటులో లేదు కాబట్టి, రోడ్డు మార్గం, చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది,
అందువల్ల, ఆర్టీసీ, క్యాబ్స్, సొంత వాహనాల్లో వచ్చేవారు, దానికనుగుణంగా ప్లాన్ చేసుకోండి.
6- అగ్గిపెట్టి, క్యాండిల్: దీపాలు వెలిగించే సామాగ్రి అక్కడ ముందుగానే అందచేస్తారు, కానీ లేట్ గా వచ్చేవారు మాత్రం ఒక అగ్గిపెట్టి, క్యాండిల్ తెచ్చుకోవడం బెటర్.
7- పాదరక్షలు పదిలం: లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ , అక్కడ పాదరక్షలకు టోకెన్ సిస్టమ్ ఉండదు, కాబట్టి ఎవరి చెప్పులను వారే జాగ్రత్త పెట్టుకోవాలి,
లేకుంటే చూపు దేవుని మీద, చిత్తం చెప్పులమీద అన్న సామెతలాగ ఉంటుంది మీ వ్యవహారం.

కార్యక్రమ వివరాలు: ప్రతి రోజూ శంఖారావం, ఓంకార, శివ పంచాక్షరీ నినాదాలతో మొదలై, ప్రత్యేక పూజలూ, కల్యాణాలు, ఉత్సవ మూర్తుల ఊరేగింపు, జ్వాలాతోరణ ప్రజ్వలనమ్, మహా లింగోద్భవం, మొదలైన క్రతువులతో ప్రాంగణమంతా, అపర వైకుంఠ, కైలాసాలను తలపిస్తుంది .
వాటితోపాటు, ప్రముఖ స్వామీజీలు, ప్రవచన కర్తలూ, పీటాధిపతులు ఉపదేశించే భక్తి, జ్ఞాన, వేదాంత బోధనలతో, మన సనాతన హిందూ ధర్మ ఖ్యాతి దశదిశలా చాట బడుతుంది.
ఇక్కడ భారీ టికెట్లు, పార్కింగ్ ఖర్చులూ లేకుండా, దీపం మొదలు అవసరమైన పూజా సామగ్రి, తీర్ధ ప్రసాదాల వరకు అన్నీ ఫ్రీగానే అందచేయబడడంతో, ధనిక పేద తారతమ్యాలు లేకుండా, భగవంతుని ముందు అందరూ
సమానమే అనే భావనతో, కులమతాలకు అతీతంగా భక్తులంతా ఒకచోట చేరి, హిందూ బంధువులుగా ఏకమై, భక్తి పారవశ్యంలో మమేకమై, ఆనందోత్సాహాలతో కార్తీక దీపారాధన జరుపుకుంటారు.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల భక్తుల, భక్తి ఆధ్యాత్మిక చింతనలో భాగమైపోయిన ఈ కోటి దీపోత్సవం, దశదిశలా వ్యాపించి, ఆ తిరుమలేశుని బ్రహ్మోత్సవం అంత ప్రఖ్యాతి పొందింది.
అలా, మన భాగ్యనగరానికే శోభాయమానంగా, సత్సాంప్రదాయంగా నిర్వహింపబడుతున్న, ఈ యేటి, కోటి దీపోత్సవాన్ని, సకుటుంబసమేతంగా సందర్శించి, పవిత్ర కార్తీక దీపారాధనతో తరించి, సుఖ శాంతి సౌభాగ్యాలను పొందండి.
సర్వేజనా సుఖినో భవంతు
