Hasyanandam February 2023 E-Book
హాస్యానందం అభిమానులకు..ఆప్తులకు..హాస్యప్రియులకు. సన్నిహితులకు
హస్యభివందనాలు
ఎప్పుడో నేను చదివిన ఒక కొటేషన్- “స్నేహం కోసం ప్రాణాలివ్వడం ఏ మాత్రం కష్టం కాదు…కానీ దానికి అర్హత ఉన్న స్నేహితులు దొరకడమే కష్టం!” అని…
ఈ వాక్యాం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వాస్తవాన్ని చాటే నిత్య సత్యం! మనం మన జీవితంలో చాలా మందిని కలుస్తాం…
కొంతమందితో కొన్నాళ్ళు స్నేహం కొనసాగుతుంది… మరికొంత కాలం తరువాత వాళ్ళలో కొందరు మాత్రమే మిగులుతారు.
ఈ దూరమయినవాళ్ళు “ఎందుకు దూరమయ్యారు?” అనే ప్రశ్న వేసుకుంటే ‘అవసరం’ అనే ‘వాస్తవం’ బయటపడుతుంది. స్నేహాల్లో కూడా లెక్కలు వేసుకుని,
అవసరాలని బేరీజు చేసుకుని కాలం గడిపే మనం… ‘ఇది ఎంత వరకు సమంజసం?” అని ఒక్కసారి ఆలోచిద్దాం!
చాలా రోజుల తరువాత కలిసిన మిత్రునితో ‘ఏమిటీమధ్య పలకరించటం లేదు?” అని, పలకరిస్తాం… అదే ప్రశ్న మనకు మనం వేసుకోం! సరే అతను ‘నేను చాలా బిజీ అంటాడు…
మనం కూడా అదే సమాధానం ఇస్తాం! రెండూ అబద్దాలే!… నిజంగా ఒక వ్యక్తిని పలకరించడానికి (ఫోన్‌లో) కూడా టైం” ఉండనంత బిజీగా ఉన్నామా? ఫోన్‌లు పట్టుకుని ఇటు అటూ
తిప్పుకుంటూ గంటల తరబడి వీడియోలు, వాట్సాప్‌లు చూసుకునే మనకి ఒక పలకరింపుకి టైం ఉండదా?… రోజూ పలకరించాలన్నది నా ఉద్దేశం కాదు గానీ..
కనీసం వారానికి ఒక్కసారైనా పలకరించి… యోగక్షేమాలు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది? ఒకప్పుడు ఈ యోగక్షేమాల కోసమే “ఉత్తరాలు” రాసుకునే వాళ్ళం.
పది రోజుల తరువాత మనకి ‘జవాబు” జాబు వచ్చేది. ఎంత బాగుండేది? మరి ఇప్పుడు ఒక్క నిముషంలో జరిగిపోయేదాన్ని ఎందుకు విస్మరిస్తున్నాం!…
అందర్నీ పలకరిద్దాం!… స్నేహాల్ని కాపాడుకుందాం… మనకు ‘ఇంత’మంది ఆప్తులున్నారని గర్వ పడదాం! స్నేహితుల కోసం ప్రాణాలు ఇవ్వక పోయినా..
ప్రాణ స్నేహితులు అనుకునే నలుగురితో స్నేహం కొనసాగిద్దాం! అందరూ వోయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా. ఉండాలని కోరుకుంటూ..