Hasyanandam June 2024 E Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు.. సన్నిహితులకు హాస్యాభివందనాలు!
అందరికంటే భిన్నంగా, ఉన్నతంగా ఆలోచించే వారిని మేధావులు అంటాము. అయితే ఈ మధ్య కాలంలో ‘స్వయం ప్రకటిత మేధావులు’ ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా.. ఎవరిని కదిలించినా ఓ చిన్న సైజు ‘స్పీచ్’ వినాల్సొస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు. మాట్లాడే ప్రతివాళ్ళూ ‘మేధావులే’. ఎదుటివారు చెప్పేది వారు వినరు.. వారు చెప్పేదే మనం వినాలి! ఇంకో రకం మేధావులు వారి బతుకు తెరువే వారికి తెలియక సతమతమౌతూ ఎదుటి వారికి ‘ఎలా బ్రతకాలో’ చెబుతారు. మరి కొందరైతే మన మాట పూర్తి కాకుండానే మనం ఏమనుకుంటామో చెప్పేస్తుంటారు.
మరో రకం మేధావులు ఉన్నారు.. వీరు అద్భుతమైన నీతులు చెప్తూ కాలం గడుపు తుంటారు… కానీ వీరికి మాత్రం ఆ ‘నీతులు’ వర్తించవు.. పాటించరు.. ఇలా వీరందర్నీ భరిస్తూ నేడు మనం నెట్టుకు రావటం చాలా కష్టమైన పని అయి పోతోంది. ఇందులో మరో కొత్త సమస్య ఏమిటంటే… ఒక విషయాన్ని నలుగురు నాలుగు విధాలుగా విశ్లేషిస్తారు. వాటిలో మనం దేన్ని నమ్మాలో… దేన్ని అనుసరించాలో తెలియక మనకుండే సమస్యలతో పాటు ఇదో కొత్త సమస్యగా
తయారయింది.
వారి వారి అభిప్రాయాలను ‘ఇది ఇంతే!’ అని సిద్ధాంతంగా మన మీద రుద్దడం ఎంత వరకు సమంజసం? కనీస జ్ఞానం లేకుండా టీవీల్లో… యూట్యూబ్ ల్లో మన బుర్రలను తొలిచేస్తున్న ఈ మేధావుల బ్రతుకు తెరువు అయిపోయిన ఈ ‘వాక్చాతుర్యం’ అనే ‘పద్మవ్యూహం’లో చిక్కుకున్న అభిమాన్యుల్లా తయారవకుండా మనల్ని మనం మనకుండే ‘ఇంగిత జ్ఞానం’తో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొందాం..
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..