వడ్డాది పాపయ్య ఆర్ట్స్ & పెయింటింగ్స్
ప్రకృతి కాంత అందాలకు తన కుంచెతో మెరుగులద్దిన చిత్రకళా గంధర్వుడాయన.
తెలుగింటి కావ్య కన్యలకి ప్రాణం పోసిన భావ చిత్రాల బ్రహ్మ ఆయన.
వపా పేరుతో, తెలుగు పత్రికా పాటకులకు ఆయన చిత్రాలు నేటికీ సుపరిచితం.
తన రంగుల మాయాజాలంతో అద్భుతమైన చిత్రాలను సృష్టించిన చిత్రకళా తపస్వి శ్రీ వడ్డాది పాపయ్య,
ఒక దశాబ్ద కాలం పైగా తన చిత్రకళా ఇంద్రజాలంతో, కళా ప్రియులను కట్టిపడేసిన శ్రీ వడ్డాది పాపయ్య
చిత్ర కళా సృష్టికి నీరాజనం ఈ వర్ణ చిత్రాల సంకలనం.
తన దైవ దత్తమైన చిత్రకళలో, పత్రికా ప్రపంచాన్ని రంగులమయం చేసికుడా, తాను మాత్రం బ్లాక్ అండ్ వైట్ లోనే, సాదా సీదాగా, ఎలాంటి బిరుదులూ సన్మానాలు సత్కారాలు ఆశించకుండా,
ప్రచార ఆర్భాటాలకు దూరంగా జీవించి, నిష్క్రమించిన నిరాడంబర ధన్యజీవి, శ్రీ వడ్డాది పాపయ్య,
తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని భావించే, అభిమానులకు, ఆయన సమాధానం ఇది,
స్వాతి, 15-11-85 సంచికలో, శ్రీ, బీపీ , శాస్త్రిగారు, నాకు రావలసిన గుర్తింపు రాలేదని అనుకోవడం పొరపాటు.
పలుభాషల చందమామ, యువ, ఏనాడో సరిగానే గుర్తించాయి. ఇపుడిపుడు స్వాతి కూడా, ఇంతకంటే మంచి గుర్తింపనేది, ఇప్పటికీ ఎప్పటికీఉండదు, దీనికిభిన్నమైన గుర్తింపు అంటే నాకు అసహ్యం.
కమర్షియల్ ఆర్టిస్టునని, ఏ పెద్దలో అనడం ఘోర నేరం మాటకేంగాని, దశావతారాల పది పేర్లూఒక్కడివే, ఇంతకూ ఏ పెద్దలతోనూ నాకు నిమిత్తంలేదు,
మనుగడకూ, పత్రికాముఖంగా వెలు వడిన చిత్రాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, స్థిర చిరత్వం ఉంటుందనే గాని,
అదేదో గుర్తింపు నర్తింపుల కోసమని కాదు. అలాంటి తలపే లేకపోవడంవల్లనే నేను నేనుగా తృప్తిగా ఉన్నాను.
మరో చిన్న మాట, ఆ గుర్తింపు రాకపోవడమే, చాలా పెద్దగుర్తింపు అనే సంతోషం నాకు దూరం కాకూడదు,
ఎవరికైనా నాపట్ల ఏపాటి అభిమానం ఉన్నా, నాలాగే సంతోషంగా అనుకోవాలని కోరుకుంటున్నాను.
మీ వడ్డాది పాపయ్య,
వడ్డాది పాపయ్య, తన ప్రతి చిత్రంలోనూ నిక్షిప్తం చేసే, సున్నా ఒకటి సున్నా రాజ ముద్ర ద్వారా, తన లైఫ్ ఫిలాసఫీని ఇలా చెప్పుకున్నారు,
ఇటు సున్నా అటు సున్నా, మధ్య నేనున్నా, నిలువు గీతగా ఒకటిగా నిలుచున్నా , ఇటు రజోవలయం, అటు తమోవలయం.
సత్వమై సత్యమై నిత్యమై నేనున్నా , గతం సున్నా భవిష్యం సున్నా, వర్తమానమై నిలుచున్నా, వర్తమానమై నిలుచున్నా..
అనే తాత్విక చింతనతో, తన అమూల్యమైన చిత్రకళా సంపదని, అభిమానుల మనస్సులో పదిలపరచి, తిరిగి తన కళాసృష్టికి మూలమైన అనంత విశ్వంలో ఏకమైన, చిత్రకళా యోగి, శ్రీ వడ్డాది పాపయ్య.
సూర్య (Surya Toons)