మువ్వాకుతో మురిపించే చిత్రాలు
ఆడపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కుక్కపిల్ల.. కాదేదీ కవితకనర్హం..! అన్నట్లుగా.. కళకు కూడా, ఏ వస్తువూ పనికిరానిది కాదు. ఏదైనా కొత్త ప్రక్రియలో కళాసృష్టి చూసినప్పుడల్లా ఈ విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. బుర్రలో క్రేటివిటీ, చేతిలో నైపుణ్యం, చేతల్లో సాధన ఉంటే.. దేనితోనైనా కళాసృష్టి చెయ్యవచ్చు. ఇక చూసేవారికి కాస్త కళా హృదయం ఉండి, సరైన ప్రోత్సాహం లభిస్తే.. ఆ కళకు గుర్తింపు తో పాటూ మంచి మార్కెట్ కూడా పెంచుకోవచ్చు.
నఖచిత్రాలు, నోటితో (కుంచె పట్టి) చిత్రించడం, ఆకులపై, అద్దాలపై, ఇసుకపై (సైకత శిల్పం), బియ్యం గింజలపై (మైక్రో ఆర్ట్), క్యాన్వాస్ పై తిరగేసి (తలకిందులుగా) చిత్రించడం లాంటి ఎన్నో చిత్ర ప్రక్రియలు, నైపుణ్యాలు మనం చూస్తూనే ఉంటాం.
ఆవిధంగా, మరో కొత్త తరహా, అరుదైన కళారూపం గురించి తెలుసుకుందాం.
అది పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం దగ్గరి వెలగదుర్రు గ్రామం. స్వతహాగానే ఆర్టిస్టు ఐన గోపరాజు గారు. తన కమర్షియల్ ఆర్టులో భాగంగా.. స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా తాటి ఆకులపై (తాళపత్ర) శుభలేఖలు, ఆహ్వానపత్రాలు, నేమ్ ప్లేట్స్ ముద్రించడంలో నైపుణ్యం సంపాదించారు. అలా..తన తాళపత్ర ప్రింటింగ్ ప్రస్థానంలో.. తాటి ఆకులతో.. బొమ్మలు కూడా వేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నంలో..ముదురుగా, పెళుసుగా వుండే తాటాకు కాకుండా, లేతగా.. చిన్న చిన్న వంపులు తిప్పేందుకు అనుకూలంగా, గోల్డ్ కలర్ రేడియంలా మెరుస్తూ వుండే, తాటి మువ్వ ఆకులను ఎంచుకోవడం జరిగింది.
ఆ విధంగా.. మొదట వినాయకుడి బొమ్మతో ఓంకారం చుట్టిన, ఈ తాటి మువ్వ ఆకుల బొమ్మలు, క్రమంగా అనేక దేవీ దేవతలు, సినీ ప్రముఖుల ముఖచిత్రాలు.. ఆపై ప్రత్యేక ఆర్డర్ ద్వారా, హోమ్ డెకరేషన్, గిఫ్టులు, కోసం చిత్రించే బొమ్మలదాకా పెరిగింది.
కాకపొతే, ఒక్కో బొమ్మ చిత్రించడానికి దాదాపు 150 గంటలు పట్టే, ఈ కళకు చాలా ఓర్పూ, నేర్పు, కావాల్సి ఉంటుంది. అంత ఓపిక లేని ఈ జనరేషన్ పిల్లలకు, యువతకు, తన వారసత్వంగా నేర్పించడానికి కూరడంలేదని నవ్వుతూ చెప్తున్నారు ఈ తాళపత్ర చిత్రకళా బ్రహ్మ శ్రీ గోకరాజు గారు.
తాటాకు బొమ్మలు అనగానే చిన్నప్పుడు “+” ఆకారంలో తాటాకును మడిచి దానికి గుడ్డ ముక్కలతో చీరా జాకెట్టు, చొక్కా పంచెలు చుట్టి, కళ్ళూ ముక్కూ, మొఖం దిద్ది, బొమ్మల పెళ్లి చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా..!
– సూర్య SURYATOONS.COM
మరింత సమాచారం, పూర్తి వీడియో కోసం కింద Links చూడండి.
Content Source ; Suman Tv | & | facebook.com/silpaarts.goparaju