Health & LifestyleVIDEOS

ఈ కాలంలో చన్నీళ్ళ స్నానం మంచిదేనా !

Pl, Share This >>

వేసవి కాలం వచ్చేసింది..గీజర్లూ, వాటర్ హీటర్లూ అటకెక్కాయి. ఉక్కబోత మొదలైయ్యింది.. చల్లటి నీళ్లు ఒంటిమీదపడితే.. హాయిగా ప్రాణం లేచి వచ్చినట్లుంటది. ఇలా ఎండాకాలం లోనే కాకుండా, సంవత్సరంలో ఏ కాలమైనా చన్నీళ్ళ స్నానమే మంచిదని చెబుతుంటారు. మన శాస్త్రాల్లో కూడా ఇదే మాట రూఢీ కావడంతో, కార్తీక మాసం చలిలోనూ, అయ్యప్ప దీక్ష పాటించడంలోనూ, చన్నీటి స్నానం ప్రాముఖ్యత తెలుస్తూనే ఉంటుంది. మన శాస్త్రాలు, పెద్దవాళ్ళు, చెప్పే దైనందిన చర్యల వెనుక ఎంతోకొంత వివేకం, విజ్ఞానం తప్పకుండా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఛస్ ! అదంతా చాదస్తం, అని కొట్టిపారేసే నాస్థికులకి, అతితెలివి తింగరి గాళ్లకి, మతాలు మారి ఫోజు కొట్టే మోడర్న్ బ్యాచ్ కీ,”క..రో..నా” రోగం వ్యాప్తి ద్వారా.. మన శుచిశుభ్రత తత్వం బాగా బోధపడింది.

ఐతే, కొన్ని సందర్భాల్లో మాత్రం, శాస్త్రం మూలాల్లో ఉన్నది ఒకటైతే, కాలగమనంలో.. కొందరి మెట్ట పండితుల సొంత పైత్యంతో, అసలు శాస్త్రీయ విషయం మారిపోయి, నిజంగానే చాదస్త విషయం వాడుకలోకి వచ్చేస్తుంటుంది. అది గమనించకుండా, గుడ్డిగా పాటించడం వలన, దాని అసలు ప్రయోజనం పొందకపోవడమే కాకుండా, సైన్సు వాదులకి లోకువై, విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుంది.

కానీ, ఇక్కడ ఈ చన్నీటి స్నానం, విషయంలో సమస్య అదికాదు, చన్నీటి స్నానం ముమ్మాటికీ మంచిదే.. కానీ అది ప్రతిపాదించిన కాలం వేరు, ఇప్పుడు మనం పాటిస్తున్న కాలం వేరు. అక్కడ వుంది మంచీ..చెడూ అన్న తేడా !

ఎలా అంటే.. పూర్వం స్నానం, సంధ్యావందనాలు అన్నీ స్వచ్ఛంగా ప్రవహించే నదులు, సెల ఏర్లు, కాలువలు, చెరువులు, తేట నీటి ఊట బావుల దగ్గర చేసే వారు. కాబట్టి అప్పటి కాలంలో, అది ఉత్తమమైనదిగా చెల్లింది. కానీ నేటి మన నీటి నిల్వ, సరఫరా విధానాలు ఎంత కాలుష్యమయంగా ఉన్నాయో తెలుసుకదా..! ఇప్పటికే నదులు, చెరువులూ – ఫ్యాకరీ, డ్రైనేజీ, ప్లాస్టిక్ వ్యర్ధాలతో కంపుకొడుతున్నాయి. అక్కడినుంచి మొదలైన కాలుష్యం, తుప్పుపట్టిన పైపుల ద్వారా, లీకేజీ ఐనచోట మరింత కలుపుకొని ట్యాంక్ లు, ట్యాప్ లు, నల్లాల ద్వారా ఇంటికి చేరుతుంది.

దాన్ని ఎప్పుడో బిల్డింగ్ కట్టేటప్పుడు తవ్విన, ఎండ తగలని, సంపులో నిల్వ చేస్తాం. అందులో బొద్దింకలూ, పురుగులూ, దోమలూ..లార్వాలతో పునీతమైన నీటిని, మోటారుతో బిల్డింగ్ పైన, ట్యాంక్ లోకి ఎక్కించి, దాని మూత, మురికి పరిస్థితి ఎలావుందో గమనించకుండా, సంవత్సరాలుగా వాడుతూనే ఉంటాం. So.. ఈ లెక్కన మనం, స్నానాకి వాడే చల్లటి నీళ్లు ఎంత డేంజరో తెలుస్తూనే వుందికదా !

పైగా మనకొచ్చే చాలా అంటు రోగాలు, చర్మ వ్యాధులూ, ఎక్కువగా నీటిద్వారానే వ్యాపిస్తాయి ! కాబట్టి, శాస్త్రం చెప్పిందికదాని, గుడ్డిగా..ఆచరించకుండా, కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ..అవసరాన్ని బట్టి వేడి నీళ్ల స్నానం చేయడమే బెటర్ కదా !

ఇలాంటివే, మరికొన్నిమన సంప్రదాయ అంశాలపై, అపోహలను నివృత్తి చేసుకోడానికి కింద వీడియో చూడండి. – సూర్య suryatoons.com


Pl, Share This >>

Leave a Reply