Hasyanandam September 2023 E-Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు సన్నిహితులకు వినాయక చవితి శుభాకాంక్షలు!
‘అనుకుంటే ఎంత సేపు?… ఇది ఎంత పని..’ అనుకుంటూ చాలామంది పనులు చేయటం మనం చూస్తుంటాం! ఈ ‘అనుకోవటం’ వరకు బాగానే ఉంది కానీ వాస్తవంలో అనుకున్నంత ‘శ్రద్ధ’తో ఆ పనులు మాత్రం చేయం. ఏదో చేసేసాం అనుకుని చేతులు దులిపేసుకుంటాం! ‘అనుకోవడాని’కి ఉన్న శ్రద్ధ చేసే పనుల్లో కనిపించడం లేదు! ఒక పని చేస్తే దాని ఫలితం ఆ ‘పని’ పట్ల అంకిత భావాన్ని ఋజువు చేయాలి! ఎంత సేపట్లో చేసాం అని కాకుండా.. ఎంత ‘పర్ఫెట్’గా చేశామనేది ముఖ్యం. మనకో గుర్తింపు… చేసే పనికో ప్రశంసా కావాలంటే కచ్చితంగా చేసే పనిని గౌరవిస్తూ చేయాల్సిందే!
ఈ మధ్య భారతదేశం సాధించిన ‘చంద్రయాన్’ విజయం వెనుక మన శాస్త్రవేత్తల కష్టం కంటే.. పని పట్ల వారికున్న శ్రద్ధాశక్తులు, ‘భక్తిభావాన్ని’ మనం గమనించాలి! పనే దైవంగా భావించి పనులు చేస్తే వచ్చే తృప్తి చాలా గొప్పది! ఇది చంద్రయాన్ విజయం లాంటిది. ఈ రోజుల్లో ఎక్కడైనా మనం తినే ఆహారం దగ్గర్నుంచి, ప్రతిదానికి ఒక ‘ఫీడ్బ్యాక్’ కోరడంలో అర్ధం ఇదే! ‘ఎలా ఉంది?.. బాగుందా?.. ఇంకేమైనా చేయాలా?..’ ఇవి మన పనులు మెరుగు పరుచుకోవడానికి పనికొచ్చే ప్రశ్నలు! తప్పనిసరిగా కాకుండా.. తప్పులు లేకుండా మన కర్తవ్యాన్ని నెరవేరుద్దాం!.. మన కోసం మనం పనులు చేద్దాం.. చేసే ప్రతి పని ఇష్టంగా చేద్దాం! చేసిన పనికి మంచి ఫలితాన్ని అందుకుందాం! అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని
కోరుకుంటూ..