Cartoonist Satyamurthy Special Old Issue E Book
హాస్యానందం అభిమానులకు… ఆప్తులకు… సన్నిహితులకు ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు!
హాస్యానందం ప్రముఖులగురించి ప్రత్యేక సంచిక వెలువరు స్తున్న పరంపరలో ఈ సంచికని శ్రీ సత్యమూర్తిగారి కార్టూన్ వైభవంగా తీర్చిదిద్దాము.
శ్రీసత్యమూర్తిగారి 75వ జన్మదిన సందర్భంగా హాస్యానందం ఈ ప్రత్యేక సంచికని ఆయనకు శుభాకాకాంక్షలతో అందిస్తోంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ… కష్టనష్టాలని ఓర్చుకుంటూ…పడుతూ… లేస్తూ…’ప్రయాణం’ సాగించిన శ్రీసత్య మూర్తిగారు ఈ రోజు యువ కార్టూనిస్ట్లకు, గ్రాఫిక్ డిజైనర్లకు ఓ ‘జంక్షన్’ అయ్యారు.
ఆయన జీవితం ఓ పెద్దబాలశిక్ష!… పెరల్సిస్ వచ్చి, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయ్యాక డాక్టర్లు పెదవి విరిచేసినా… గొప్పదైన తమ సంకల్ప బలంతో కోలుకున్నారు. స్వాధీనంలోకి రాని చేతిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఆయన పట్టుదల, పని పట్ల అంకితభావం ఎలాంటివో అర్ధమవుతుంది.
చిన్నపిల్లాడిలా ‘కాపీ’ బుక్ తో అక్షరాలను ప్రాక్టిస్ చేసారు. తన స్టైల్ బొమ్మలు తయారయ్యే వరకు మొండిగా బొమ్మలు గీసారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి తన చేతిని స్వాధీనంలోకి తెచ్చుకుని పట్టుదల, కృషికి మారుపేరుగా ‘B’ అంటే ‘Brave’…‘V’ అంటే ‘Victory’ గా బి.వి.సత్యమూర్తిగారు సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు.
ఆయన పర్ఫెక్షన్ కోసం ఎంత శ్రమిస్తారో – స్వయంగా చూసాను నేను. 1987లో గ్రాఫిక్ డిజైనింగ్ ట్రైనింగ్ కోసం నేను ఆయన దగ్గర జాయినయ్యాను. ఒక చిన్న లైన్ కూడా ఎంత షార్ప్ ఉండాలో దగ్గరుండి నేర్పించారు. పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి‘బాగుంది’ అంటే సీరియస్గా ‘బాగుంది అంటే ఎదగడం ఆగిపోతుంది.’ అనేవారు. ఈ రోజుకి నేను ఏపని చేస్తున్నా ఆ మాటలనే ‘మంత్రం’గా మననంచేసుకుం టుంటాను.
థ్యాంక్స్ సత్యమూర్తిగారూ!
ఈ సంచిక చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారు కదూ?
అందరూ హాయిగా…ఆనందగా ఉండాలని కోరుకుంటూ…