నిరాశ నుండి ఆశల నింగికి ప్రయాణం “ఆకాశం”
ఒక గీతను చెరపకుండా చిన్నది చేయాలంటే, దానిపక్కనే మరోపెద్ద గీత గీయాలనేది చిన్నప్పుడు బడిలోనే తెలుసుకునే సూత్రం. మన జీవితంలో కూడా ఈ సూత్రాన్ని ఎప్పుడో ఒకప్పుడు అమలుపరుస్తూనే వుంటాం. ముఖ్యంగా సమస్యలూ కష్టాలు ఎదురైనప్పుడు నిరాశ పడకుండా, అంతకంటే పెద్ద సమస్య లేదా కష్టంతో పోల్చుకొని నిలదొక్కుకోవడం, కొంత స్వాంతన పొందడం జరుగుతుంటుంది.
ఇదే ఫార్ములాతో ఎన్నో మోటివేషన్, ఇన్స్పిరేషన్ స్టోరీస్ మనచుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక సినిమాల్లో ఈ ఫార్ములాని మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే తో చూపించగలిగితే, అది అందరికీ నచ్చడమే కాకుండా, ఏంతో కొంత సెల్ఫ్ రియలైజేషన్ కూడా పొందడం జరుగుతుంది.
అలా ఒక ఇంట్రావర్ట్ ఐన హీరో (అర్జున్ – అశోక్ సెల్వన్) తన సమస్యని పెద్దగా ఊహించుకొని, ఒంటరిగా సతమతమౌతున్న సమయంలో, తాను చదివిన ఇద్దరి అసంపూర్తి కధలు, వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే తపనతో, చేసే అన్ ప్లాన్డ్ ప్రయాణాలూ, మధ్యలో తారసపడే హీరోయిన్ తో.. సరదా సంగతులూ, చివరికి ఊహించని మలుపులతో క్లైమాక్స్ బాగున్నాయి.
కధనం కొంతవరకూ డిస్కవరీ ప్రయాణాల నేపథ్యంలో వచ్చిన ఫీల్ గుడ్ మూవీస్..గమ్యం, జాను, ఎవడే సుబ్రహమణ్యం లా అనిపించినా, కధ కొత్తగాఉండడంతో ఆ ఫీలింగ్ కవర్ అయిపోతుంది. ఒకప్పటి సామెత (లో సగం) “తిరక్క మగాడు చెడిపోతాడు” అన్నది కూడా ఇందులో కనిపిస్తుంది.
ఇది Ra.Karthik డైరెక్షన్ లో వచ్చిన తమిళ సినిమా “Nitham Oru Vaanam”కి డబ్బింగ్ ఐనప్పటికీ “పెళ్లిచూపులు” హీరోయిన్ రీతూ వర్మ, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక లతో మన అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మరో హీరోయిన్ అపర్ణ బాలమురళీ అల్లరి యాక్టింగ్ అదిరిపోయింది. అతిధి పాత్రల్లో జీవా, ఇషా రెబ్బా, శివదా తదితరులు బాగా రక్తి కట్టించారు. – Surya