Hasyanandam November 2023 E-Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు సన్నిహితులకు, హాస్యాభివందనాలు!
హాస్యానందం, మన ప్రముఖుల ప్రత్యేక సంచిక రూపొందించటంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
ఆ ప్రక్రియలో భాగంగా తెలుగువారి (ఆంధ్రుల) ఆహ్లాద రచయిత శ్రీమల్లాది వెంకట కృష్ణమూర్తిగారి పుట్టినరోజు నవంబర్ పదమూడు సందర్భంగా ఈ ప్రత్యేక సంచిక రూపొందిం చటం జరిగింది.
అయితే ఆయన గురించి ఈ ప్రత్యేక సంచికలో ఓ వ్యాసం రాయాలనుకున్నప్పుడు.. ఆయన రాసిన జాబిలి మీద సంతకం, రేపటి కొడుకు, అందమైన జీవితం, మందాకిని లాంటి లేడీస్ ఓరియెంటెడ్ నవలలని ప్రస్తావించదలచుకోలేదు.
వాటిలో అక్కడక్కడ కామెడీ పాత్రల్లో సంఘటనలు ఉన్నా అవి మన పత్రికకి సంబంధించిన నవలలు కావు.
మిస్టర్ వి, మిస్సింగ్, ఎవరికీ చెప్పక, విలన్ లాంటి నవలల గురించి కూడా ఆ వ్యాసంలో రాయదల్చుకోలేదు. ఎందుకంటే వాటిలో అక్కడక్కడ కామెడీ ఉన్నా క్రైం మన పత్రిక పరిథిలోకి రాదు.
సముద్రపు దొంగలు, కొత్తశత్రువు, నత్తలొస్తున్నాయి జాగ్రత్త లాంటి ఫేంటసీ నవలలు చదివినా వాటి గురించి కూడా ఇక్కడ చెప్పదల్చుకోలేదు.
మల్లాది రాసిన పిల్లల పేర్ల పుస్తకం, వంటల పుస్తకం, నవల వెనక కథ, జరిగిన కథ, టిఫిన్ వెరైటీలు, ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్… లాంటి నాన్్ఫక్షన్ల గురించి మనకెందుకు చెప్పండి?
11-12-13, 24 గంటల్లో, బ్లఫ్మస్టర్, తొమ్మిదిగంటలు లాంటి సస్పెన్స్ నవలల జోలికి వెళ్లదల్చుకోలేదు.. వాటిలో సరదా సన్నివేశాలున్నా.
భార్య-భర్త-మరొకరు, బ్రిటిష్ క్రైం కథలు లాంటి అనువాద క్రైం కథలు కూడా ఆయన రాసారు. అవి ఉత్కంఠగా చదవడానికి పనికొస్తాయి తప్ప నవ్వడానికి వాటిలో ఒక్క ముక్క లేదంటే నమ్మండి!
మరి మల్లాది గురించి ఏం రాయాలి? రెండు రెళ్ళు ఆరు, చంటబ్బాయ్, సద్దాం ఆంటీ ఇంటి కథ, కేవలం జోక్స్ రాసిన కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్, మిస్టర్ మిరియం, సుందరి-సుబ్బారావు (ఇది మన హాస్యానందంలో సీరియల్గా ప్రచురితమైంది) లాంటివి రాసారు కాబట్టి, మల్లాది మన బృందానికే చెందినవారు అని నమ్మి ఈ ప్రత్యేక సంచికని రూపొందించాం.
కోరగానే మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనల మీద తమ స్పందనలని పంపిన పాఠకులకి, రచయిత(త్రు)లకి, కార్టూనిస్టులకి.. అందరికీ శతకోటి నమస్కారాలు.
మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇలాగే రాస్తూ జీవించాలని, జీవిస్తూ రాస్తూండాలని (దాసరి నారాయణరావుని గుర్తుకి తెచ్చానా?) అని ఆశిస్తున్నాను.
ఎప్పటిలానే ఈ ప్రత్యేక సంచికని ఆదరిస్తారని ఆశిస్తూ.. అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..
Hasyanandam-November-2023