Hasyanandam October 2023 E-Book
హాస్యానందం అభిమానులకు.. ఆప్తులకు.. హాస్యప్రియులకు సన్నిహితులకు విజయదశమి శుభాకాంక్షలు!
ఆనందం.. ఎవరు కోరుకోరు?.. అందరికీ కావాలి!
ఒక్కొక్కరూ ఒక్కో దారిలో వెతుక్కుంటూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం!
కానీ ఈ ఆనందం ముఖ్యంగా ‘మానవ సంబంధాల’తో ముడిపడి ఉంటుందనే విషయం ఎంతమంది గ్రహించగలుగుతున్నాం?.. మన చుట్టూ ఉండే బంధు, మిత్రుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది?.. వాళ్ళతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? అని ఒకసారి ఆలోచించి.. అందరితో ఏ భేషజాలు లేకుండా మనం ప్రవర్తిస్తే మనం కచ్చితంగా ఆనందంగా ఉండగలం. అందరూ కలిసినప్పుడు మనం పంచుకునే ‘గత’ జ్ఞాపకాలు కూడా ఆనందానికి హేతువులు. ఒక మిత్రున్ని పలకరించడానికి ఈ రోజుల్లో ఎన్నో మార్గాలున్నాయి. ఒక్క క్షణం తీరిక చేసుకుని, చేసే పలకరింపు వలన బంధాలు బలపడతాయి. కొందరు ‘నువ్వు ముందా… నేను ముందా’ అంటూ పలకరించడానికి ‘అహం’ కరిస్తుంటారు! ఇది ఎంతగా అంటే ఎప్పుడూ కలిసే… మాట్లాడే వాళ్ళు కొన్ని రోజులు కనబడకపోయేసరికి కూడా ఏమైందీ? ఎలా ఉన్నారంటూ అస్సలు స్పందించరు. దీని వలన ఎలాంటి సంబంధాలు కొనసాగవు. ఇది ఇలా కొనసాగితే చివరకు మనం ఒంటరిగా మిగలడం ఖాయం! మన భావాలు, భావనలు పంచుకోవడానికి నలుగురు ఉండాలి.. మాట్లాడుకోవాలి.. భావాలు పంచుకోవాలి.. ఆనందంగా ఉండాలి!
ఈ గజిబిజీ జీవన విధానంలో సంతోషం సాంత్వనతోనే వస్తుంది. అది మన ఆత్మీయుల దగ్గరే దొరుకుతుంది. ఆనందం, సంతోషం ‘అలా వచ్చి ఇలా పోయే’ అలలలాంటివి. అయితే ఆనందం పొందడానికి అనవసర
ప్రయత్నాలు ఏవీ చేయాల్సిన అవసరం లేకుండా.. మన చుట్టూ నలుగురు ఆత్మీయులను సంపాదించుకుని.. ఆ ‘బంధాన్ని’ బాధ్యతగా భావించి.. ‘దాన్ని’ కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం చేస్తే… ఆనందం మన సొంతం అవుతుంది!
అందరూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..